హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలకు తెరతీశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ విమర్శించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతున్నామని చెప్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన ప్రభుత్వం వెంటనే గవర్నర్‌కి పంపి ఆమోదం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఆ తర్వాత జీవోలు జారీ చేసి అమలులోకి తీసుకురావాలని తెలిపారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాజ్యాంగ సవరణ, 9వ షెడ్యూల్ పేరిట నాటకాలకు తెరతీశారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో మే 23న బీసీల ధర్మయుద్ధభేరి సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్‌రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తారా? లేకపోతే సీఎం పదవి నుంచి దిగిపోతారా? తేల్చుకోవాలని హెచ్చరించారు. బీసీలను మోసం చేయాలని చూస్తే రాజకీయంగా కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని తేల్చిచెప్పారు.