నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 10: ఏపీలోని శ్రీకాళహస్తి ఏర్పేడు ఎన్నికల ప్రచారంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై ప్రతిపక్ష పార్టీ నేతలు భౌతికదాడులకు పాల్పడడాన్ని ప్రజాసంఘాల నేతలు శుక్రవారం తీవ్రంగా ఖండించారు. కులనిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు దాడులకు ఎందుకు దిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణయ్యపై జరిగిన దాడిని యావత్ బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్ పేర్కొన్నారు. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీల సమస్యలపై 47 ఏండ్లుగా పోరాటం చేస్తున్న బీసీల ఆశాజ్యోతి కృష్ణయ్యపై శ్రీకాళహస్తిలో రాళ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం విమర్శించారు. ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడమంటే 70 కోట్ల బీసీలపై దాడి చేయడమేనని స్పష్టం చేశారు.