కాప్రా/భువనగిరి అర్బన్/హనుమకొండ చౌరస్తా, నవంబర్ 16: రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే చెల్లించాల ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజు బకాయిల చెల్లింపులు, మెస్ బిల్లుల పెంపు, తదితర సమస్యలపై హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో శనివారం విద్యార్థుల మహా ర్యాలీ నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమా లు చేపడ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉన్నదని, కా నీ విద్యార్థులు అంటే పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. తన వైఖరి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీసీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం నాయకుడు ముత్యం వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. భువనగిరి ఆర్డీవో కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. కార్యాలయ గదికి తాళం వేసి నిరసన తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్, నూనావత్ అరుణ్నాయక్, మహలింగం పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ పాల్గొన్నారు.