హైదరాబాద్, మే3 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన నూతన మార్పులు తెలంగాణ యువత కలలను కల్లలు చేయనున్నాయి. నూతన సాంకేతిక విద్యావకాశాలకు బడుగు విద్యార్థులను దూరం చేయనున్నాయి. సంప్రదాయ కోర్సులకే వారు మళ్లీ పరిమితం కానున్నారు. ఈనాటి నిరుపేద విద్యార్థులు కూడా మళ్లీ దశాబ్దన్నర క్రితం నాటి దుర్భర పరిస్థితులను అనుభవించనున్నారు. విద్యా అసమానతలు పెరుగనున్నాయి. సూటిగా చెప్పాలంటే పురోగమన మార్గం నుంచి తిరోగమనం వైపునకు ఈనాటి యువతను నడిపించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలంగాణ విద్యావేత్తల్లో సర్వత్రా ఇవే భయాందోళనలు నెలకొన్నాయి.
నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో వేసిన పునాదులపై కేసీఆర్ ఆశల సౌధాలను నిర్మిస్తే.. నేడు రేవంత్ సర్కార్ అందుకు భిన్నంగా ఉన్న ఆయువునే తీసే చర్యలకు పూనుకొన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 7 ద్వారా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీరని నష్టం చేకూరనున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల ఉన్నత విద్యావకాశాలు ఇకపై కొన్ని పట్టణాలకే పరిమితమయ్యే అవకాశమున్నది. ఫీజుల భారాన్ని భరించలేక బడుగు విద్యార్థులు కాలేజీల్లో చేరకుంటే సీట్లు నిండక ప్రస్తుతమున్న అరకొర కాలేజీలను సైతం ప్రైవేట్ యాజమాన్యాలు ఎత్తివేయక తప్పని పరిస్థితులు ఎదురవనున్నాయి. గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు భారం కూడా పడనున్నది. అంతిమంగా ఉన్నత విద్య మళ్లీ మిథ్యగానే మిగిలిపోయే పరిస్థితులు దాపురించనున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2008-09 విద్యాసంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత, సాంకేతిక విద్య చేరువైంది. ఇది సామాజిక విప్లవానికి నాంది పలికింది. ఫీజులేని కారణంగా ఏ నిరుపేద విద్యార్థి కూడా ఉన్నతవిద్యకు దూరం కాని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో చదివే నిరుపేద విద్యార్థులకు సంబంధించి ఫీజులను ప్రభుత్వమే చెల్లించడం ప్రారంభమైంది. సంప్రదాయ కోర్సుల నుంచి బడుగు బలహీనవర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు అనేక అధునాతన కోర్సుల వైపు మళ్లారు. అభిరుచులకు తగిన కోర్సులను ఎంచుకుని ఆయా రంగాల్లో స్థిరపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విశాల దృక్పథంతో ఇదే పథకాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించారు. ఈ పథకానికి వన్నె తెచ్చేలా, మరింత మంది బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు లబ్ధి పొందే ప్రణాళికలను అమలు చేశారు. ఉన్నత విద్యావకాశాలను పొందేందుకు ఊతమిచ్చారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు, పీజీతోపాటు మెడిసిన్, ఇంజినీరింగ్ తదితర కోర్సులను లక్షలాది మంది పూర్తిచేసేందుకు అవకాశం కల్పించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే అభిలాష కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల కోసం విదేశీ విద్యానిధి పథకాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని అందించి బడుగుల విదేశీ విద్యకు ప్రోత్సహించారు.
దశాబ్దకాలంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఊహించని రీతిలో విస్తృతి చెందింది. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత పెను విప్లవాన్ని సృష్టిస్తున్నది. సమస్త రంగాల గతిని మార్చివేస్తున్నది. నూతన ఉద్యోగాల సృష్టికి, విస్తృత ఉపాధి రంగాల వికాసానికి దోహదపడుతున్నది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఎన్నో అధునాతన, సాంకేతిక కోర్సులు ఆవిష్కృతం అవుతున్నాయి. ఆయా కోర్సులతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటువైపు యువత పరుగులు పెడుతున్న దశలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రూపురేఖలు మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ పూనుకున్నది. సర్కార్ చర్యలతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజుల భారం పడనున్నది.
ఆ అధునాతన విద్యకు నిరుపేద విద్యార్థులను దూరం చేసేందుకే ఈ చర్యల సారాంశం అని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫీజులు చెల్లించలేని బడుగు యువత అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. వారి కలలు కల్లలుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితులు దాపురించనున్నాయి. అభిరుచులను కాదని, ఆర్థిక పరిస్థితులను అనుసరించి మళ్లీ సంప్రదాయ కోర్సులకే బడుగు బలహీనవర్గాల విద్యార్థులు పరిమితం కావాల్సి వస్తున్నది. ఇది మళ్లీ విద్యా అసమానతలకు దారితీయడమే గాక, మున్ముందు ఆయా రంగాల్లో మానవ వనరుల కొరతకూ ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నది.
విశాల దృక్పథంతో కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నేడు రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేస్తున్నది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఫీజు బకాయిల చెల్లింపులను నిలిపేసింది. కాలేజీలను నిర్వహించలేని దుస్థితి నెలకొన్నదని యాజమాన్యాలు ఒకవైపు, ఫీజుల బకాయిలను సాకుగా చూపుతూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని విద్యార్థులు మరోవైపు రోదిస్తున్నా సర్కార్ నుంచి కనీస స్పందన కూడా కరువైంది.
వన్‌టైమ్ సెటిల్మెంట్ అంటూ కొంతకాలం, ట్రస్ట్ ఏర్పాటుచేసి బకాయిలు చెల్లిస్తామని మరికొంతకాలం వెళ్లదీసింది. సీఎం రేవంత్‌రెడ్డి హామీలకే దిక్కులేని దుస్థితి నెలకొన్నది. ఆందోళనలు చేసినా కాంగ్రెస్ సర్కార్‌లో చలనం లేకుండాపోయింది. బకాయిలు చెల్లించాల్సింది పోయి ఇప్పుడు ఏకంగా ఫీజుల చెల్లింపు బాధ్యత నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైంది. జీవో7 ద్వారా నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ మరణశాసనం రాసేందుకు రేవంత్ సర్కార్ పూనుకున్నది. కాలేజీలకు కాకుండా నేరుగా విద్యార్థులకే ఫీజులు చెల్లిస్తామని చెప్తున్నా నిర్దిష్ట గడువును వెల్లడించకపోవడంతో అంతిమంగా అది పథకం నిర్వీర్యానికే కుట్ర జరుగుతుందనేది స్పష్టంగా తెలిసిపోతున్నది.
కాంగ్రెస్ సర్కార్ తాజాగా తెచ్చిన జీవో 7ను తక్షణమే రద్దు చేయాలి. ఈ జీవో నిరుపేద విద్యార్థులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ముందుగా ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటారు. వారు అప్పు చేసి ఫీజు చెల్లించినా, ఆ అప్పును వడ్డీతో కలిసి తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్మెంట్ సరిపోదు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థులకు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు. మూడు, నాలుగేండ్లకోసారి రిలీజ్ చేస్తే ఇక ఆ సొమ్ము అప్పుపై వడ్డీకి చాలదు. చాలామంది విద్యార్థులు అడ్వాన్స్‌గా ఫీజు చెల్లించలేక అడ్మిషన్లు కోల్పోతారు. ఈ విధానం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారు.
– చిరంజీవులు, విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్
నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల ఉన్నత విద్యావకాశాలపై నీళ్లు జల్లే కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఆర్థికంగానే కాదు.. సామాజిక కోణంలోనూ ఆలోచించి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. రాజకీయ విభేదాలు చూపకుండా మాజీ సీఎం కేసీఆర్ యథాతథంగా ఆ పథకాన్ని అమలు చేయడమే కాక, దానిని విస్తృతం చేసి లక్షలాది మంది విద్యార్థులకు వర్తింపజేశారు. గురుకులాలు, విదేశీ విద్యానిధి పథకాల ద్వారా బడుగులకు ఉన్నత చదువును మరింత చేరువచేసేలా బాటలు వేశారు. కానీ ఈనాటి రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టింది. విద్యా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానే జీవో 7ను తీసుకువచ్చినట్టు అర్థమవుతున్నది.
-ప్రొఫెసర్ రమేశ్‌బాబు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్