హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్లోని పద్మశాలి భవన్లో బీసీ మేధావుల సభ నిర్వహించనున్నట్టు సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ రోజుకో డ్రామా ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీసీలు ఆయా పార్టీల కుట్రలను పసిగట్టాలని, లేకుంటే మరోసారి మోసపోయే ప్రమాదముందని హెచ్చరించారు. బీసీ కులసంఘాలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గిరిజన సంక్షేమ శాఖలో కార్మికుల సమ్మె ; 10 నెలల పెండింగ్ వేతనం చెల్లించాలని డిమాండ్
భద్రాచలం, సెప్టెంబర్ 12 : గిరిజన సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డెయిలీవేజ్ కార్మికులు ఔట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేశ్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్మికులపై వివక్ష చూపుతూ.. 10 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను పస్తులు ఉంచడం సరైన పద్ధతి కాదని హితవుపలికారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, గిరిజన సంక్షేమ శాఖలో నూతనంగా విడుదల చేసిన క్యాటరింగ్ జీవోను రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి రూ.15,600 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేత వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టంచేశారు.