హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతమున్న 10 బీసీ కులాల ఫెడరేషన్లను కూడా కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాయడంతోపాటు మీడియాకు శనివారం విడుదల చేశారు. బీసీ శాఖ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ, రజక, వడ్డెర, నాయీబ్రాహ్మణ, వాల్మీకి, భట్రాజు, మేదర, కృష్ణ బలిజ, పూసల, సగర, కుమ్మరి ఫెడరేషన్లు ఉన్నాయని తెలిపారు. ఫెడరేషన్ల నుంచి ఆయా కులవృత్తులకు ఆర్థికసాయం అందిస్తే కేవలం 50శాతం వరకే సబ్సిడీ వస్తుందని, అదే కార్పొరేషన్లుగా మారిస్తే 80శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. రుణాల పరిమితినీ పెంచాల్సి ఉంటుందని వెల్లడించారు.