హైదరాబాద్, జూన్14 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని, సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు బీసీ కులసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరాపారు వద్ద శనివారం ఉదయం 11గంటలకు మహాధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు హాజరుకానున్నారని, బీసీ మేధావులు, యువకులు భారీగా తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.