హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ‘ఏమిటీ తొందరపాటు? ఎవరు తరుముతున్నారు? బీహార్ ఎన్నికల్లో బీజేపీ చేతికి ఆయుధం ఇద్దామనకుంటున్నారా? ప్రభుత్వపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి తీరా ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే ప్రతిపక్షాలు ఊరుకుంటయా? రాహుల్‌గాంధీ తలెత్తుకొని ప్రచారం చేయగలగుతారా? ఇంతకాలం మనం తండ్లాడింది ఇందుకోసమా? తెలంగాణలో పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లి.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగగలుగుతామా? రాహుల్‌గాంధీ హామీకి మీరే తూట్లు
పొడవాలని చూస్తారా?’ అంటూ సీనియర్ కాంగ్రెస్ బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీసినట్టు తెలిసింది.
బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వపరంగా సాధ్యం కావడం లేదని, పార్టీపరమైన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనపై బీసీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఈ అంశంపై ప్రశ్నించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్ హన్మంతరావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, గనుల కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్ ఆయనకు మద్దతుగా మాట్లాడినట్టు తెలిసింది. శనివారం రాత్రి నాలుగు గంటలపాటు సాగిన పీఏసీ, అడ్వైజరీ కమిటీల సమావేశంలో నేతలు బీసీ, బీసీయేతర వర్గాలుగా చీలిపోయినట్టు తెలిసింది.
కోర్టు ధికరణ కింద సుప్రీంకోర్టుకు ఎందుకు పోలేదు?: బీసీ నేతలు
బీసీ వర్గం నేతల నుంచి మధుయాష్కీగౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వపరంగా కాకుండా పార్టీపరంగా అమలు చేస్తే రాహుల్‌గాంధీ చెప్తున్నదానికి విరుద్ధమని, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు సమాచారం. రేపు పొద్దున బీహార్‌లో జరుగబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ ప్రచారం చేస్తే రాహుల్‌గాంధీ ప్రతిష్ఠ దెబ్బతిటుందని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఏ ఫైల్ అయినా.. 90 రోజులకు మించి తన వద్ద ఉంచుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, మనం బిల్లులు పంపి 120 రోజులు దాటిందని, అయినా కోర్డు ధికరణ కింద మనం ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేక పోయామని నిలదీసినట్టు తెలిసింది. అలా చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసినట్టయినా అయ్యేదని, ఏమీ చేయకుండా కేంద్రం చే యడం లేదంటే ఎవరు నమ్ముతారని బీసీ నేతలు సీఎంను నిలదీసినట్టు తెలిసింది.
కంగుతిన్న సీఎం
బీసీ నేతల వాదనతో కంగుతిన్న సీఎం చేయాల్సినదంతా చేశామని, ఇంకేం చే యాలో మీరే చెప్పండంటూ బీసీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సీఎం వ్యాఖ్యల అనంతరం మళ్లీ అందుకున్న బీసీ నేత ఒకరు పార్టీపరమైన రిజర్వేషన్లతో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సి న అవసరం ఏమొచ్చిందని, ఈ విధమైన తొందరపాటు బీహర్ ఎన్నికల ముందు బీజేపీ చేతికి ఆయుధం ఇచ్చినట్టే అవుతుందని అన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యం లో మంత్రి సీతక్క కల్పించుకొని.. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,570 కోట్లు ఆగిపోయాయని వివరించినట్టు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ఐదు నెలలు గడిచిందని, రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదని, ఎన్నికలు జరిగితే ప్రభుత్వం అ మలు చేస్తున్న పథకాలు గడప గడపకూ చేరతాయని అన్నట్టు తెలిసింది. ఆమె వ్యాఖ్యలకు మహేశ్‌కుమార్‌గౌడ్ కల్పించుకొని కేంద్రం నిధులు రావడం ముఖ్యమై న అంశమే కానీ, బీసీ రిజర్వేషన్లు కూడా అంతే ముఖ్యమని అన్నట్టు సమాచారం.
రెండు రోజుల్లో ఇంత చేయగలరా?
బీసీ రిజర్వేషన్లతో పెట్టుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో వెళ్లలేమని, అది ఇప్పట్లో తేలే అంశం కానేకాదని మాజీమంత్రి జానారెడ్డి అన్నట్టు తెలిసింది. పార్టీపరంగానే ముందుకు వెళ్లాలనే ప్రతిపాదనే ఉత్తమం అని సూచించినట్టు సమాచారం. ఆయనకు మద్దతుగా తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడినట్టు సమాచారం. ప్రభుత్వపరంగా 42% రిజర్వేషన్లు అమలు అంటే తాత్సారం తప్ప ప్రయోజనం లేదని, ఇప్పటివరకు ఎక్కడా జరగనిది మన రాష్ట్రంలో ఎలా జరుగుతుందని తుమ్మల ఎదురుదాడికి దిగినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా న్యాయసలహా సంప్రదింపుల కమిటీ ఏర్పాటుపై ప్రకటన చేసి, బీసీ నేతలను చల్లబరిచేందుకు సీఎం ప్రయత్నించినట్టు తెలిసింది. అయినా శాంతించని బీసీ నేతలు పార్టీపరమైన కమిటీతో ప్రభుత్వపరమైన హక్కులు ఎలా వస్తాయని నిలదీసినట్టు తెలిసింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో దేశంలోని ప్రముఖ న్యాయ నిపుణులను కలవడం, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం, వాటిని నివేదించడం సాధ్యం అవుతుందా? అని నిలదీసినట్టు సమాచారం.