హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కులగణన నివేదికను ప్రభుత్వం పునఃసమీక్షించి తప్పులను సరిదిద్దాల్సిందేనని, అప్పుడే ప్రభుత్వంతో తాము చర్చిస్తామని బీసీ సంఘాల నేతలు, మేధావులు అల్టిమేటం జారీచేశారు. లేదంటే బీసీ ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. కులగణన నివేదికపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ మేధావుల ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్, బీసీ కుల సంఘాల జేఈసీ చైర్మన్ కుందారం గణేశ్చారితోపాటు పలువురు బీసీ సంఘాల నేతలు బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమయ్యారు.
బీసీ ఉద్యమా న్ని విసృ్తతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం భవిష్య త్తు కార్యాచరణ ప్రకటించారు. ‘ఏది నిజం’ పేరిట 9న బీసీ ప్రజాప్రతినిధుల విసృ్తతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
సర్వే చేయించి బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు కోర్టు తీర్పులను సాకుగా చూపుతూ పార్టీపరంగా సీట్లు ఇస్తామని మాట మార్చడం అత్యంత దుర్మార్గమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల ద్రోహి అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర నిప్పులు చెరిగారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అబద్ధాలకు ప్రతిరూపమే కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు.