వేములవాడ, సెప్టెంబర్ 19: ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను అవమానించిన కలెక్టర్ సందీప్ కుమార్ఝాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీసీ సంఘాల నాయకులు పొలాస నరేందర్, నేరెళ్ల తిరుమల గౌడ్, చిలుక రమేశ్, బొజ్జ కనుకయ్య, కూరగాయల కొమురయ్య, తదితరుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు ర్యాలీగా వెళ్లి వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న సిరిసిల్లలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమానికి సకాలంలో హాజరు కాకపోవడమే కాకుండా, జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలో పెద్దగా సైరన్ వేసుకుని వచ్చి కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీ బిడ్డ అయినందునే ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకలేదని ఫిర్యాదులో పేరొన్నారు. ఉద్దేశపూర్వకంగా బీసీ బిడ్డను అవమానించిన కలెక్టర్ సందీప్కుమార్ఝాపై చర్యలు తీసుకోవాలని కోరారు.