మహబూబాబాద్ రూరల్/వరంగల్/నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 5 : కులగణన తీరుపై బీసీ సంఘాల నేతల భగ్గుమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్, హనుమకొండ కలెక్టరేట్ల ఎదుట బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుగు కుమార్, రాష్ట్ర ఉప కార్యదర్శి నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదిక సరిగా లేదంటూ బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం, విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో కులగణన నివేదిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ కులగణన తప్పుల తడకగా ఉన్నదని విమర్శించారు. 2014 నుంచి 2024 వరకు 21 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు.