హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కులగణన నిర్వహించి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించింది. దీనికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని హామీ ఇ చ్చింది. కానీ, ఆచరణలో మాత్రం విఫలమైంది. అధికారం అందినా చట్టబద్ధత ఊసెత్తలేదు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, కుల సర్వే చేపడతామని తీర్మానం మాత్రమే చేసింది. తరువాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కులగణన కోసం రూ.150 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మార్గదర్శకాలను రూపొందించ లేదు. ప్రస్తుత బడ్జెట్లోనూ అందుకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు సైతం ఆ దిశగా ముమ్మర కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అంశాన్ని పక్కన పెట్టనున్నట్టు అర్థమవుతున్నదని బీసీ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
కులగణన ఎలా నిర్వహిస్తారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవైపు న్యాయపరమైన చిక్కులు, మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డంకిగా నిలిచేలా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవలే ప్రభుత్వ పెద్దలు పంచాయతీ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కులగణన అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. కులగణన సా ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. కులగణన నిర్వహించేందుకు ఎక్కువ సమయం పడుతుందనే అభిప్రాయవ్యక్తమైనట్టు అధికార వర్గా లు తెలిపాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకా రం కులగణన నిర్వహించే వెసులుబాటు మాత్ర మే ఉన్నది. ఓటరు జాబితా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలన్నా 4-5 నెలలకు మించి సమయం పట్టే అవకాశమున్నది. ప్రస్తుత డెడికేటెడ్ కమిషన్ కాలపరిమితి ఆగస్టు 31తో ముగుస్తుంది. కమిషన్ను యథావిధిగా కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదు, మళ్లీ కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసి నిర్వహించాలంటే మరింత సమయం పడుతుందనేది అధికారుల వాదన. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ కులగణన హామీతోపాటు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముందుకు పోవడం ఎలా? అనేదానిపై సర్కార్ అంతర్మథనంలో పడిపోయిందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఒడిశా తరహాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మినహా మరే రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని రాష్ట్రంలోని బీసీ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కులాల గణన (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల వారీగా) నిర్వహించి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఉపకులాల వారీగా కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కులగణన కోసం పలు బీసీ సంఘాలు యాత్రలు చేపట్టగా, ఆ దిశగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచేందుకు మరికొన్ని సంఘాలు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.