హైదరాబాద్, మే17 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రంలోని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లపై చర్చించడానికి శుక్రవారం ఈ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జూన్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కులాలవారీగా జనాభా లెక్కలు తీసి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఇప్పటికీ కులగణన ప్రక్రియ మొదలుకాలేదని, రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదం టే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీసీ, కుల సంఘాల నేతలు గుజ్జ కృ ష్ణ, లాల్ కృష్ణ, దానకర్ణాచారి, నీల వెంకటేశ్, జనార్దన్, నందగోపాల్, వేముల రామకృష్ణ, చంద్రశేఖర్, ఉదయ్, రఘుపతి, ప్రణితరాణి, రాజ్‌కుమార్, శివమ్మ, నిఖిల్, నాగరాజు, కోటేశ్వరచారి, వినోద్, వేణుకుమార్, తిలక్‌సింగ్, శ్రీనివాసచారి పాల్గొన్నారు.