హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి తీరుపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సీరియస్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్లోని ప్రగతి విద్యాలయం పాఠశాల నుంచి 85 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 54 మంది విద్యార్థులకు 1,000 లోపు ర్యాంకులు వచ్చాయి.
అందులో ఆకాశ్ అనే విద్యార్థి రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించాడు. సదరు విద్యార్థి వాస్తవంగా బీసీ ఏ గ్రూపునకు చెందిన వాడు. కానీ ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో బీసీ ఏ గ్రూపు అని పెట్టారు. కానీ ఎంబీసీ కులం కాలమ్లో పొరపాటున టిక్ మార్క్ చేశారు. దీంతో అడ్మిషన్ ఇచ్చేందుకు సొసైటీ అధికారులు నిరాకరిస్తు న్నారు. ప్రగతి విద్యాలయం హెడ్మాస్టర్ తాజాగా బీసీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ విషయంపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సీరియస్ అయ్యారు.
వివాదంపై ప్రవేశ పరీక్ష కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత దశలో దరఖాస్తు వివరాల్లో మార్పులు చేయాలన్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవడం చట్టపరంగా, సాంకేతికపరంగా సాధ్యపడదని, దాని వల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకతకు భంగం వాటిల్లుతుందని తేల్చిచెప్పారు.