హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటే బీసీ కమిషన్ సిఫారసులు తప్పనిసరని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. నిర్దిష్టమైన ప్రామాణిక పద్ధతులను పాటించకుండా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే న్యాయపరమైన వివాదాలు తప్పవని హెచ్చరించారు. ఫలితంగా బీసీలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రామాణిక పద్ధతులను పాటిస్తూ, ఏ సంస్థలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఆయా సంస్థలకే అప్పగించడం న్యాయసమ్మతమని తెలిపారు.
అలా కాకుండా ప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలు సాధ్యం కావని అభిప్రాయపడ్డారు. రాజకీయ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్, విద్యా, ఉద్యోగ రంగాల రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సిఫారసులు తప్పనిసరి అని తెలిపారు. ఆయా కమిషన్ల సిఫారసులు లేకుండానే ప్రభుత్వమే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే, చట్టాలు చేస్తే న్యాయసమీక్ష ఎదుట అవి చెల్లబోవని, బీహార్ ఉదంతమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం ప్రామాణిక పద్ధతులతో ముందుకు పోవాలని సూచించారు.