Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మాటలు కోటలు దాటుతాయి. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లను ప్రకటిస్తారు.. తీర్మానాలు కూడా చేస్తారు.. కానీ అన్నీ కాగితాల మీదనే. ఆచరణలో ఒక్కటీ అమలు కాదు. దేనికీ కట్టుబడి ఉండరు. ఏ హామీకి విలువ ఉండదు. అన్నీ నీటిమీద రాతలే. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ వరకు అన్నీ సజీవసాక్ష్యాలే. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు నిలువెత్తు నిదర్శనాలే. ఆఖరికి నామినెటేడ్ పదవుల భర్తీలోనూ సామాజిక న్యా యానికి తిలోదకాలిచ్చారు..దీనిని బట్టి అట్టడుగువర్గాల అభ్యున్నతిపై ఆ పార్టీ చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతుంది. కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై బీసీ మేధావులు, కులసంఘాల నేతలు, సామాజికవేత్తలు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ బోగస్..
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం 2022 మేలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగింది. నవసంకల్ప్ పేరిట అందరికీ న్యా యం, సామాజిక న్యాయం నినాదాలతో హో రెత్తించింది. పలు తీర్మానాలు చేసింది. ప్రధానంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తామని ఊదరగొట్టింది. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం అంటూ బీరాలు పలికింది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను కచ్చితం గా అమలు చేస్తామని గాంధీభవన్ వేదికగా మరోసారి తీర్మానం చేసింది. కానీ ఆచరణలోనే తూట్లు పొడిచింది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే బీసీలకు మొత్తంగా 34 ఎమ్మె ల్యే టికెట్లను కేటాయించాల్సి ఉన్నా కేవలం 20 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. వాటి లో ఐదు సీట్లు పాతబస్తీ పరిధిలో ఉన్నాయి. అంటే డిక్లరేషన్‌లో పేర్కొన్న దానిలో నికరంగా సగం కంటే తక్కువ సీట్లను కేటాయించి బీసీలను మోసం చేసింది. 17 పార్లమెంట్ స్థానాలకుగాను మూడు సీట్లనే బీసీలకు కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న మూడు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏ ఒక్కటీ బీసీలకు కేటాయించలేదు.
అటకెక్కిన కామారెడ్డి డిక్లరేషన్..
‘కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తాం” ఇదీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కామారెడ్డి వేదికగా ప్రకటించిన డిక్లరేషన్. కానీ దీని అమలులోనూ ఇప్పుడు మాట తప్పింది. రిజర్వేషన్ల పెంపునకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం సీలింగ్ ఆటంకంగా మారిందని సన్నాయినొక్కులు నొక్కుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని చేతులేత్తయడంతోపాటు పార్టీ పరంగానే రిజర్వేషన్లను కల్పిస్తామని కొత్త నాటకానికి తెరలేపింది. కులగణనకు ఏమైనా చట్టబద్ధత కల్పించిందా అంటే అదీ లేదు. కేవలం అసెంబ్లీలో నోట్‌ను ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నది.
ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలె..
డిక్లరేషన్లు, తీర్మానాలే అటకెక్కగా, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల సంగతీ అదేవిధంగా ఉంది. అధికారంలోకి వస్తే బీసీ సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, ఐదేండ్లకుగాను లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే పేరుతో బీసీ సబ్‌ప్లాన్ తీసుకొస్తామని మ్యానిఫెస్టోలో పేరొన్నది. కానీ నిరుడు బడ్జెట్లో బీసీలకు 8000 కోట్లు మాత్రమే కేటాయించింది. బీసీ కార్పొరేషన్‌కు నిరుడు బడ్జెట్లో 700 కోట్లను కేటాయించినా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కల్యాణలక్ష్మి కింద లక్షతోపాటు, తులం బంగారం ఇస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని సైతం అటకెక్కించింది. విదేశీ విద్యానిధి నిధులకు ఒక్క రూపా యి కూడా విడుదల చేయడం లేదు. ఇప్పటికైనా సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీసీ సంఘాలు, కులసంఘాల నేతలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
నామినేటెడ్ పదవుల్లో ద్రోహం..
చట్టసభలు, ఇతర రాజకీయ అవకాశాల సంగతి అలా ఉంచితే నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ కాంగ్రెస్ బీసీలను వంచించింది. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం అగ్రవర్ణాలకు చెందిన అధికారులతోనే నిండిపోయిందని, కేవలం ఒకే ఒక బీసీ, ఎస్సీ అధికారికి మాత్రమే అవకాశమిచ్చారని, కార్పొరేషన్ పదవులన్నీ అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని బీసీ సంఘాల నేతలు, కాంగ్రెస్ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు కలిపి 38 మందికిపైగా చైర్మన్లను నియమించింది. అందులో కేవలం 8 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. వాటిలోనూ 3 కార్పొరేషన్లు బీసీలవే కావడం గమనార్హం. ఇదే విషయమై బీసీ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంకా కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఎక్కడుందో రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని వారు నిలదీస్తున్నారు.