హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయకుండా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సమర్థ గ్రామపాలనకు- సర్పంచుల హ్యాండ్ బుక్’ ఆవిషరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ప్రతి సర్పంచ్ పుస్తకం చదివి పంచాయతీల్లో సుపరిపాలన అందించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 3 శాతం జనాభా ఉన్న ఓసీలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తూ బీసీలను నయవంచనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇది అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్యగౌడ్ అధ్యక్షత వహించగా, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్ , బైరు శేఖర్గంగపుత్ర, ఎలికట్టె విజయకుమార్‌గౌడ్, పాలకూరి అశోక్,అంబాల నారాయణగౌడ్, బోయ గోపి, ఎర్ర మధు, వెంకన్న, గోలి గిరి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.