Telangana Police | (నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ బెటాలియన్ బైఠా యించింది. విధుల పేరుతో వెట్టి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కుటుంబసభ్యులతో కలిసి నిరసనలకు దిగారు. ప్రభుత్వం దిగిరాకపోతే యూనిఫాంలోనే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో శనివారం కానిస్టేబుళ్లు మెరుపు సమ్మెకు దిగారు. కానిస్టేబుళ్లు అందరూ సాముహికంగా సెలవులు పెట్టి ప్రత్యక్షంగా నిరసన చేపట్టారు. అసభ్యంగా మాట్లాడిన నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని పోలీసులు బెటాలియన్ గేటు వద్ద అరెస్టు చేశారు.
ఆయనను ముందుగా నార్కెట్పల్లికి తరలించి, అక్కడి నుంచి మునుగోడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లా మామునూరులోని నాలుగో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కమాండెంట్ కార్యాలయం ఎదుట ఏక్ పోలీస్ ఆకారంలో బైఠాయించారు. అనంతరం ర్యాలీగా తరలివచ్చి బెటాలియన్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా కానిస్టేబుళ్లు యూనిఫాం ధరించి నిరసన చేపట్టడం అటు హోంశాఖతో ఇటు ప్రజల్లో తీవ్ర చర్చగా మారింది. కమాండెంట్ రాంప్రకాష్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇబ్రహీంపట్నం సాగర్హ్రదారిపై బెటాలియన్ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. భార్యాపిల్లలతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు.
మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి నచ్చజెప్పినా వినకపోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం బెటాలియన్ సిబ్బంది ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గుడిపేట 13వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో చేశారు. చిన్న పిల్లలతో వచ్చిన కానిస్టేబుళ్ల భార్యలు ఎండను సైతం లెక్కచేయకుండా రాస్తారోకోలో కూర్చున్నారు. ైప్లెఓవర్పై రాస్తారోకో చేస్తున్న కానిస్టేబుళ్లతో ఏసీపీ ప్రకాశ్‌కు స్వల్ప వాగ్వాదం జరిగింది. కాసేపటికి బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు ఫ్లైఓవర్ నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ చౌరస్తాలో ఆదిలాబాద్ 2వ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రాస్తారోకో చేశారు. కానిస్టేబుళ్ల భార్యలను మహిళా కానిస్టేబుళ్లు వచ్చి చెదరగొట్టే ప్రయత్నం చేయగా, ఓ కానిస్టేబుల్ భార్య ఒడిలోని చిన్నపిల్లాడు రోడ్డుపై పడిపోయాడు. కొత్తగూడెం, చాతకొండకు చెందిన ఏఆర్ 6వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో శనివారం ప్ల కార్డులతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీస్ అధికారి ఓ కానిస్టేబుల్‌ను తోసివేయడంతో పోలీస్ కుటుంబాలు భగ్గుమన్నాయి.
కాల్మొక్త..న్యాయం చేయండి సార్!
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీసు బెటాలియన్‌లోని సుమారు 250 మంది కానిస్టేబుళ్లు కమాండెంట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కమాండెంట్ శ్రీనివాసరావు నైట్ డ్యూటీలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన వద్దకు చేరుకున్న ఎస్పీ అఖిల్‌మహాజన్ కాళ్లపై ఓ కానిస్టేబుల్ పడి న్యాయం చేయాలని కన్నీటిపర్యంతం కావడం అక్కడున్న వారిని కలిచివేసింది.
మాకు న్యాయం కావాలి
నాకు నాలుగు నెలల పాప ఉంది. నా భర్త 13వ బెటాలియన్‌లో కానిస్టేబుల్. బందోబస్తుకు పోతే వారం, పది రోజులు రాడు. కొన్ని సార్లు నెలల తరబడి డ్యూటీకి పోతాడు. ఎప్పుడు వస్తాడా అని చిన్న పిల్లతో బిక్కుబిక్కుమని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏక్ పోలీస్..ఏక్ డ్యూటీ ఇచ్చే వరకు నేను, నా బిడ్డ ఈ రోడ్డు మీదే కూర్చొడానికి సిద్ధమనే వచ్చిన. మాకు న్యాయం కావాలి.
– ఎస్ శిరీష, మంచిర్యాల, గుడిపేట 13వ బెటాలియన్ కానిస్టేబుల్ భార్య
రికార్డ్ పర్మిషన్ వద్దు
ఎప్పటిలాగానే రికార్డ్ పర్మిషన్ పెడుతామంటున్నారు. మాకు మొత్తానికే రికార్డు పర్మిషన్ అవసరం లేదు. ఒకే దగ్గర మా ఫ్యామిలీతో ఐదు సంవత్పరాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మెస్ మొత్తానికే ఎత్తివేయాలి. ఐదేండ్లు ఒకే దగ్గర పోస్టింగ్ ఇస్తే మెస్ అవసరం లేదు. ఏక్ పోలీస్ వ్యవస్థ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.
– రాజ్యలక్ష్మి, గుడిపేట 13వ బెటాలియన్ కానిస్టేబుల్ భార్య
ఏక్ పోలీస్ విధానం తెస్తాం
గణేశ్, రంజాన్ పండుగలకు హైదరాబాద్ డ్యూటీ వేస్తే, రోడ్లమీద 10 -15 రోజులు స్నానాలు చేయక, డ్రాయర్లు కోసుకపోయి అగచాట్లు పడేది. నేను పోలీసోళ్ల కుటుంబం నుంచి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెలుసు. ఇంట్లో వారి భార్యాబిడ్డల బాధా తెలుసు. మేము అధికారంలోకి వస్తే ఏక్పోలీసు వ్యవస్థను తీసుకొస్తాం. మీ కష్టాలు తీరుస్తాం’
– పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్
నేడు
ఆందోళనకు దిగితే కఠిన చర్యలు
యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళనలు నిర్వహించడం తీవ్రమైన విషయం. పోలీస్ ఫోర్స్ యాక్ట్, పోలీసు యాక్ట్, పోలీసు మాన్యువల్ ప్రకారం చట్టపరమైన, పరిపాలనాపరమైన కఠిన చర్యలు ఉంటాయి.
– డీజీపీ జితేందర్