Yadagirigutta | యాదగిరిగుట్ట, అక్టోబర్ 10: బతుకమ్మ సాక్షిగా ఓ వడ్డెర మహిళ అవమానానికి గురైంది. బతుకమ్మ పండుగలోనూ కుల చిచ్చు రాజేశారు ఆ ఊరి కులస్థులు. ‘మా బతుకమ్మతో మీరు ఆడొద్దు’ అంటూ ఇరు కులాల వారు ఘర్షణకు దిగారు. ఈ అమానుష ఘటన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో గురువారం జరిగింది.
వడ్డెర కులానికి చెందిన పల్లపు సమ్మక్క బతుకమ్మను తీసుకొస్తుంటే.. ‘మాతో మీరు బతుకమ్మ ఆడవద్దు. మీరు వేరేగా ఆడుకోండి’ అని కురుమ కులస్థులు అడ్డు చెప్పారు. దీంతో ఇరు కులాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వడ్డెర కులస్థురాలికి చెందిన బతుకమ్మను వేరు చేసి వేడుకలను కొనసాగించారు. గ్రామంలో ఒకే ఒక వడ్డెర మహిళ ఉండటంతో ఆమె బతుకమ్మ ఎక్కడ ఆడాలో తెలియక ఇబ్బంది ఎదుర్కొంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సతీమణి అనిత అక్కడే ఉన్నారు.