హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరలు జిల్లాలవారీగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, శనివారం నుంచి కలెక్టర్లు పంపిణీని ప్రారంభిస్తారని టెస్కో వైస్ చైర్మన్ శైలజా రామయ్యర్ తెలిపారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని చీరల పంపిణీ విధానాన్ని కలెక్టర్లే నిర్ణయిస్తారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి లబ్ధిదారుల ఇండ్ల వద్దే పంపిణీ చేయడం లేదా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గ్రామ/వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయడం, లేదా యథావిధిగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీచేయడం అనేది సంబంధిత జిల్లా పరిపాలనాధికారులు నిర్ణయిస్తారని, పంపిణీ సకాలంలో పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. చీరల పంపిణీకి గ్రామ, వార్డుస్థాయి కమిటీలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఈ ఏడాది 1.08 కోట్ల చీరలు అవసరమవుతాయని నిర్ణయించిన అధికారులు ఆ మేరకు సిద్ధం చేయించారు. 2017లో ఆహార భద్రత కార్డు కింద నమోదైన 95,48,439 మహిళలకు, 2018లో 96,70,474 మందికి, 2019లో 96,57,813 మందికి, 2020లో 96,24,384 మందికి చీరలను పంపిణీచేశారు. ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో అన్వయించి విస్తృత శ్రేణిలో మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తెచ్చారు. జరి అంచులతో 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్/నూలుతో తయారుచేయడం విశేషం. 6.30 మీటర్ల పొడవుగల కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధులు కట్టుకొనే 9 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం రూ.333.14 కోట్లు కేటాయించింది.