Bathukamma | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అంటే బతుకమ్మ! బతుకమ్మ అంటే తెలంగాణ! ఈ ప్రాంత ఆత్మగౌవర ప్రతీకగా నిలిచి.. ఉద్యమ చైతన్య గీతికై ఎగిసి.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రపంచ ఖ్యాతి గాంచిన మన బతుకమ్మ పండుగను కాంగ్రెస్ సర్కార్ మరిచిపోయింది. నేటి ఎంగిలిపూల నుంచి మొదలయ్యే ఆడబిడ్డల అతిపెద్ద వేడుకకు కనీస ఏర్పాట్లు చేయకుండా చిన్నచూపు చూస్తున్నది. ఎన్నికల్లో మహిళలకు అలవిగాని హామీలిచ్చి వారి ఓట్లతో అందలమెక్కి ఇప్పుడు ఆడబిడ్డలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మనే పక్కనపెట్టేసింది. ‘కూల్చుడు సంబురం’లో పడి ‘బతుకమ్మ సంబురాల’ను మరుగున పడేసింది.
నేటి నుంచే బతుకమ్మ సంబురాలు
తెలంగాణ అంతటా నేటి (బుధవారం) నుంచి బతుకమ్మ సంబురాలు మొదలు కానున్నాయి. ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ఇంటింటా పూలసింగిడి పరుచుకోనున్నది. ఊరూవాడా ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ అంతా మురిసిపోనున్నది. కానీ, మన రాష్ర్టానికే ప్రత్యేకమైన ఈ పండుగకు రేవంత్‌రెడ్డి సర్కార్ కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాట వరుసకైనా ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలా ఏ స్థాయిలోనూ బతుకమ్మ పండుగపై సమీక్ష నిర్వహించిన దాఖలాల్లేవు. పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. ఆలయాలు, ఊరుమ్మడి స్థలాలు, చెరువు గట్లు విద్యుద్దీపాల అలంకరణతో బతుకమ్మ కాంతులీనుతుంది. ఆయా చోట్ల ఏర్పాట్లపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదు.
కూల్చుడుపైనే శ్రద్ధా?
కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చుడు మీద ఉన్న శ్రద్ధ బతుకమ్మ పండుగ మీద లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ఇండ్లను కూల్చి కుప్పపోస్తున్నది. కానీ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ నిర్వహణ విషయంలో ఏ మాత్రం పట్టింపు లేదని ఆడబిడ్డలు ఆవేదన చెందుతున్నారు. పితృ అమావాస్య ప్రారంభమయ్యే పది రోజుల ముందే ఏర్పాట్లకు సంబంధించిన మొత్తాన్ని గత ప్రభుత్వం విడుదల చేసేది. కానీ, ఇప్పుడు యంత్రాంగం, మంత్రాంగం అంతా హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ చర్యల్లో తలమునకలయ్యాయి. పండుగ ఏర్పాట్లపై సమీక్షించే తీరిక కూడా లేకుండా బిజీ అయ్యాయి.
ఇప్పటికే చీరలు ఎగ్గొట్టి
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ (తెల్లరేషన్‌కార్డు/ఫుడ్‌సెక్యూరిటీ కార్డు ఉన్నవారికి) బతుకమ్మ పండుగకు పది రోజుల ముందే చీరలు పంపిణీ చేసేది. ఏడెనిమిది నెలల ముందు చేనేత కార్మికులకు చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చేది. కానీ, ఈసారి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వక వారి ఉపాధిని కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీసింది. ఆడబిడ్డలకు చీరల పంపిణీ కానుకను ఎత్తగొట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనతో సరిపెట్టారు. ‘బతుకమ్మ పండుగ అంటే కొండంత సంబురం. పండుగకు ముందే కేసీఆర్ కంట్రోల్ షాపులకు ముందే చీరలు పంపేటోడు. షాపోళ్లు అందర్నీ పిలిచి ఇచ్చేటో ళ్లు. ఈపాలి ఏదీలేదు. నెత్తికొరిగి కొప్పే త్త..కొప్పుమీద బోనం ఎత్తుత’ అన్నట్టే కాంగ్రెసోళ్ల ముచ్చట ఉన్నది’ అని నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన వృద్ధురాలు మణెమ్మ కాంగ్రెస్ సర్కార్ తీరును ఒక్కముక్కలో వివరించింది.