హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి ప్రసాదించిన పూల పండుగ బతుకమ్మ అని, తీరొక్క పూలతో ఆడబిడ్డలు సంబురంగా జరుపుకునే ఈ వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉందని డీజీపీ జితేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ.. బతుకమ్మల నిమజ్జనంతో చెరువుల్లోని నీరు శుభ్రమవుతుందని శాస్త్రీయంగా నిరూపితమైందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
డీజీపీ కార్యాలయ మహిళా సిబ్బందితో కలిసి డీజీ శిఖాగోయెల్, ఏడీజీ స్వాతిలక్రా, డీఐజీ రెమా రాజేశ్వరి, మహిళా ఎస్పీలు బతుకమ్మ ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, ఏడీజీ మహేశ్‌భగవత్, ఐజీలు సత్యనారాయణ, రమేశ్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, ఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.