కవాడిగూడ, ఆగస్టు 24: ఉబ్బస వ్యాధిగ్రస్థులకు చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్‌గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి షుగర్ లెవెల్ పెరగడంతో ఇంట్లోనే మృతిచెందారు. ఆయన మృతితో హైదరాబాద్ భోలక్‌పూర్‌లోని పద్మశాలి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. 1944లో హైదరాబాద్‌లోని దూద్‌బౌలిలో బత్తిని హరినాథ్‌గౌడ్ జన్మించారు. 40 ఏండ్ల క్రితం భోలక్‌పూర్‌లోని పద్మశాలి కాలనీకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య సుమిత్రాదేవి, కుమారులు అనిల్‌గౌడ్, అమర్నాథ్గౌడ్, కూతుళ్లు అల్కానంద, అర్చన ఉన్నారు.
హరినాథ్‌గౌడ్ చిన్ననాటి నుంచే తన నానమ్మ వద్ద చేప ప్రసాదం తయారీని నేర్చుకొని అన్నదమ్ములతో కలిసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తమ సోదరుడు అనిల్‌గౌడ్ ఆస్ట్రేలియా నుంచి, అక్క అల్కానంద అమెరికా నుంచి రావాల్సి ఉన్నట్టు బత్తిని తనయుడు అమర్నాథ్గౌడ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్‌పేట శ్మశానవాటిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బత్తిని హరినాథ్‌గౌడ్ భౌతికకాయానికి గౌడ కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు రజినీకాంత్‌గౌడ్ నివాళులు అర్పించారు.