సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 25: ఏజెంట్ మోసంతో ఎడారి దేశంలో చిక్కుకొని అష్టకష్టాలు పడుతూ కాపాడాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన గురవయ్య అలియాస్ సతీశ్ అర్థిస్తున్నాడు. స్వదేశం రావడానికి చేతిలో ఉన్న డబ్బులు సరిపోక సాయం చేయాలని శనివారం ఫేస్బుక్ లైవ్ పెట్టి రోదిస్తూ వేడుకున్నాడు. వీడియో సారాంశం ప్రకారం.. ‘నేను నెలక్రితం భార్య, పిల్లలను విడిచిపెట్టి, ఏజెంట్ చేతికి డబ్బులు ఇచ్చి మస్కట్ వచ్చా. అక్కడ ఓ కంపెనీలో సైప్లె పని ఉందని చెప్పారు.
తీరా ఇక్కడికి వచ్చాక వేరే పని చేయించడంతో ఆరోగ్యం సహకరించడం లేదు. స్వదేశం పంపించాలని సార్లను వేడుకున్నా పట్టించుకుంటలేరు. 650 రియాళ్లు ఇస్తే పంపిస్తామన్నరు. ఇపుడు 300 రియాళ్లు కట్టమంటున్నారు. నా దగ్గర ఇంటినుంచి తెప్పించుకున్న రూ.40వేలు(200 రియాల్లు) ఉన్నయి. ఇంకా 100 రియాల్లు కావాలి. తెలుగోని మొఖం చూసైనా పంపించాలి. ఇంటికాడ ఏం లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నరు. ఇక్కడ గార్డెన్లో ఉంటున్నా, మస్తు మందికి ఫోన్ చేశా. ఎవరూ ఇయ్యలే. టికెట్‌కు రూ.60వేలు అవుతాయి.బాంచెన్. దండం పెడతా..’ అంటూ ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.