హిమాయత్‌నగర్, డిసెంబర్ 11: హిమాయత్‌నగర్ డివిజన్లోని బగ్గీఖాన బస్తీలో చెక్కుల పంపిణీకి బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరుకాగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడు ఇస్తారని బస్తీవాసులు నిలదీశారు. త్వరలో ఇస్తామంటూనే ఎమ్మెల్యే వెళ్లిపోవటంపై స్థానికులు అసహనం వ్యక్తంచేశారు.
చిక్కడపల్లి, డిసెంబర్ 11: కవాడిగూడ డివిజన్ పరిధిలోని లాల్ బహదూర్ శాస్త్రీనగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎల్బీనగర్లో 40 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా, ఈ నెల 5న కలెక్టర్ కార్యాలయంలో 37మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. బుధవారం లబ్ధిదారులకు తాళాలు ఇచ్చేందుకు అధికారులు రాగా స్థానికులు అడ్డుకున్నారు. గాంధీనగర్ పోలీసులు చేరుకొని అధికారులు, సిబ్బందిని స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. 70 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్న తమకు కేటాయించకుండా బస్తీకి సంబంధం లేనివారికి కేటాయించారని బాధితులు మండిపడ్డారు.