హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానల సేవలు భేష్ అని తాజా అధ్యయనం ప్రశంసించింది. 2015-2023 మధ్య కాలంలో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో అర్బన్ పీహెచ్సీ మాడల్స్ చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు అధ్యయనం చేశారు. ఈ నివేదికను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్’ పబ్లిష్ చేసింది. పాలసీల రూపకల్పన, జియోగ్రఫిక్ రిప్రజెంటేషన్, క్షేత్రస్థాయి డాక్యుమెంట్ల పరిశీలన, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్యూహెచ్ఎం) ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఈ రిపోర్టును తయారుచేసింది. దేశంలో పట్టణీకరణ ర్యాపిడ్ స్పీడ్‌లో పెరుగుతున్నదని, 2036 నాటికి దేశంలో 35% మంది నగరాల్లో నివసిస్తారని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అర్బన్ ఏరియాల్లో క్వాలిటీ హెల్త్‌కేర్‌కు డిమాండ్ పెరుగుతున్నదని తెలిపింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో బస్తీ దవాఖానలు వైవిధ్యమైన పనితీరుతోపాటు పలు ఆవిష్కరణలు తీసుకొచ్చి సత్ఫలితాలు సాధించినట్టు వివరించింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో బస్తీ దవాఖానలు ప్రారంభించింది. ప్రతి ఏటా ఒక్కో బస్తీ దవాఖానలో 10 వేల నుంచి 40 వేల మంది పేషెంట్లు వైద్యసేవలు అందుకున్నారు. బస్తీ దవాఖానల్లో ఔట్‌పేషెంట్ కేర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ) స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్ పరీక్షలు, ఫార్మసీ సేవలు అందించడంతో సత్ఫలితాలు సాధించింది.
యూపీహెచ్‌సీలతో పోలిస్తే బస్తీ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, ల్యాబ్ సర్వీసులు మెరుగ్గా ఉన్నాయని అధ్యయనం తెలిపింది. బస్తీ దవాఖానలు.. డయాగ్నొస్టిక్ హబ్‌లు, సెకండరీ దవాఖానల డిజిటల్ రిఫరెల్ మెకానిజమ్‌తో పనిచేశాయని, ప్రతిరోజూ సగటున 50 నుంచి 150 మంది పేషెంట్లు ఒక్కో బస్తీ దవాఖానలో ఓపీ సేవలను వినియోగించుకున్నారని తెలిపింది. ప్రతి యూనిట్లో మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టును ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని పేర్కొన్నది. ఢిల్లీ, ముంబై, కర్ణాటక, రాజస్థాన్‌తో పోలిస్తే సెకండరీ, టెరిటరీ దవాఖానలతో బస్తీదవాఖానలు బలమైన వ్యవస్థను ఏర్పర్చుకున్నట్టు తెలిపింది.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో బస్తీ దవాఖానలు అద్భుతంగా పనిచేస్తున్నాయని అధ్యయనంలోని గణాంకాలు స్పష్టంచేశాయి. హైదరాబాద్‌లో ప్రతిరోజూ సగటున 50 నుంచి 150 మంది పేషెంట్లకు ఓపీ సేవలు అందగా.. ఢిల్లీలో 80-100, ముంబైలో 80-120, బెంగళూరులో 70-90, జైపూర్‌లో 50-100 మందికి మాత్రమే చికిత్స అందినట్టు ఈ నివేదిక తెలిపింది. సాంకేతికత వినియోగంలో సైతం తెలంగాణ ముందంజలో ఉన్నదని కొనయాడింది. బస్తీ దవాఖానల్లో ఈ-సంజీవని, ఏఎన్ఎం యాప్‌లను వినియోగించుకుని వైద్యం అందించారు. అదే సమయంలో ఢిల్లీలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్డులు జారీచేశారు. ముంబైలో పేపర్‌బేస్డ్, బెంగళూరులో బేసిక్ డిజిటల్ టూల్స్‌ను మాత్రమే వినియోగించారు. జైపూర్‌లో పాక్షికంగానే ఈ-సంజీవనిని వినియోగించుకున్నారని పేర్కొన్నది.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానలు డిజిటల్ హెల్త్ సిస్టమ్ ఐటీ ఇంటిగ్రేషన్‌ను సమర్థంగా వినియోగించుకున్నట్టు అధ్యయనం తెలిపింది. ఏఎన్ఎం యాప్‌తోపాటు టెలికన్సల్టేషన్ కోసం ఈ-సంజీవనిని ఉపయోగించుకుని సత్ఫలితాలు సాధించినట్టు వెల్లడించింది. డయాగ్నొస్టిక్, ఎన్సీడీ స్క్రీనింగ్ సేవలు అందుబాటులోకి రావడంతో బస్తీ దవాఖానలకు రోగుల సంఖ్య పెరిగినట్టు పేర్కొన్నది. బస్తీ దవాఖానలకు తగినంత నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని, పట్టణ ప్రజల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే యూపీహెచ్‌సీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది.
పేదలు ఏ చిన్న క్లినిక్‌కు వెళ్లినా.. వందల్లో ఫీజులు, నిర్ధారణ పరీక్షలు, మందుల పేరిట వేలల్లో చెల్లించక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలనే ఉక్కు సంకల్పంతో నాడు కేసీఆర్ బస్తీ దవాఖానలకు ఊపిరి పోశారు. నాణ్యమైన వైద్యసేవలతో బస్తీ దవాఖానలను పేదలకు సంజీవనిగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో 2018లో బస్తీ దవాఖానలు ప్రారంభించారు. ప్రతి ఐదువేల నుంచి పదివేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటుచేసి ఉచిత వైద్యసేవలు అందించారు. 57 రకాల ఉచిత పరీక్షలతోపాటు 158 రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక బస్తీ దవాఖానలను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందనే విమర్శలున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన ‘బస్తీ దవాఖానల బాట’లో ఇదే విషయం తేటతెల్లమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు బస్తీ దవాఖానల్లో నెలకొన్న సమస్యలను తీర్చి.. మెరుగైన వైద్యసేవలు అందిస్తే పేదలకు మరింత మేలు కలుగుతుంది.
