ఖైరతాబాద్, జూలై 9: దశాబ్దాలుగా గుడిసెలు వేసుకొని, ఇండ్లు కట్టుకొని జీవిస్తున్న తమ భూముల్ని కొందరు ఆక్రమించుకొని దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బసవతారకనగర్ బస్తీ కమిటీ వాసులు ఆరోపించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 36లో ఉన్న ఈ బస్తీ కమిటీ వాసులు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసుల తరఫున సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షుడు మాస్టర్ జీ, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ మాట్లాడారు. గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబరు 37లో పెట్టిన క్రషర్ కంపెనీలో ఏండ్లుగా వడ్డెర, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న సుమారు 200 కుటుంబాలు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. వారందరికీ ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయని, విద్యుత్తు, నీటి బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. కొందరికి బీపీఎల్ నంబర్లు కూడా వచ్చాయని వివరించారు.
2021లో అప్పటి ఆర్టీవో చంద్రకళ ఇది ప్రభుత్వ స్థలమంటూ పోలీసులతో వచ్చి జేసీబీలతో ఇండ్లు కూల్చివేశారని గుర్తుచేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు నుంచి స్టేటస్ కో వచ్చిందని, పాక్షికంగా కూలగొట్టిన ఇండ్లలోనే వారు తలదాచుకుంటున్నట్టు చెప్పారు. జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా కూల్చివేతలు వద్దని ఆదేశించిందని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా, స్థానిక బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, మరికొందరితో కలిసి తమ భూములను కబ్జా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ భూములపై కబ్జాదారులకు ఎన్వోసీ ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే అందరికీ పకా ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు వాపోయారు. కబ్జాదారులతో బాధితులకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షించాలని కోరారు.