నిర్మల్, ఆగస్టు 1: బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాలయ కల్పనకు నాణ్యమైన విద్యా బోధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలో మంత్రిని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకట రమణ మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా బాసర విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, క్యాంటిన్ నిర్వహణ- ఆహార నాణ్యత, బొధన, బోధనేతర అంశాలు గురించి వీసీ ..మంత్రికి వివరించారు.
సమస్యలు పునరావృతం కాకుండా ప్రణాళికల రూపకల్పన, దశల వారీగా వాటిని అమలు చేయడం, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, కమిటీల ఏర్పాటు తదితర అంశాల గురంచి చర్చించారు.
విద్యార్థుల భవిష్యత్, వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే యూనివర్సిటీని సందర్శించి, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ముష్రప్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, రెవెన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.