బాసర : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాసరలోని త్రిపుల్ ఐటీ ( Basara Triple IT) కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం (Sensational Decision ) తీసుకున్నారు. టీచింగ్ కాకుండా తాము అదనపు బాధ్యతలు చేయలేమంటూ రాజీనామాలను (Resignation) వీసీకి సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వ జీవో 21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదనపు బాధ్యతలను స్వీకరించలేమని తేల్చిచెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్ తో పాటు పరిపాలనా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అయినప్పటికీ, వారి సేవలకు గుర్తింపు లేకపోవడమే కాకుండా, క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాము న్యాయమైన డిమాండ్లను సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ స్పందన శూన్యం. ఈ పరిస్థితుల్లో అదనపు బాధ్యతలు నిర్వహించడం అన్యాయం. అందుకే ఈ రాజీనామా ఒక్కటే మాకు మిగిలిన మార్గం. అని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.