హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : 22-ఏ నిషేధిత జాబితాపై తప్పు జరిగిందని ఒప్పుకొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందుకు క్షమాపణ కూడా చెప్పారు. అయితే మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 22-ఏ నిషేధిత బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఈ దొంగ ఏడుపులు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు తీరిగ్గా సారీ చెప్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. జరిగిన నష్టానికి బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. రెండు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా, తిన్న తిండి ఒంటికి పట్టకుండా బాధితులు పడుతున్న ఆందోళన, ఆవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, ఇతర అవసరాలకు ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించలేని దుస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమ ఆస్తులకు డిమాండ్ లేకుండా పోయిందని, కొనుగోలుకు కూడా ఎవరూ ముందుకురావడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘ఇంతచేసీ ఇప్పుడు తీరిగ్గా సారీ చెప్తారా? సారీ చెప్తే మా బాధలు తీరుతాయా? మా ఆస్తులకు మళ్లీ డిమాండ్ వస్తుందా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
అధికారులపై నెపంనెట్టి తప్పించుకుంటరా?
పాత జీవోలు, ఉత్తర్వులు, ఆదేశాలను పట్టించుకోకుండా వాటిని అప్లోడ్ చేయకుండా తమ అధికారులు తప్పు చేశారని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు. తద్వారా తప్పంతా అధికారులదే అనేలా మంత్రి చెప్పడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తెలియకుండా అధికారులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసి.. ఇప్పుడు నంగనాచి వేషాలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరవెనుక ఏదో కుట్రలకు ప్లాన్ చేసి.. ఇప్పుడు ఇది బూమరాంగ్ కావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిసిస్తున్నాయి. ప్రజలకు అన్యాయం జరిగిందని, అధికారులు తప్పు చేశారని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారంటూ బాధితులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఈ విషయం మంత్రి పొంగులేటి దృష్టికి నెల క్రితమే వచ్చింది. కానీ అప్పుడు ఆయన దీన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు. ఇదేం పెద్ద సమస్య కాదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
కానీ ఇప్పుడు అది దావానలంలా పాకి.. పెద్దది కావవడంతో తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే గతంలో ఇది సమస్యే కాదన్న మంత్రి.. నేడు స్వయంగా రోజుల తరబడి సమీక్షలు చేస్తూ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి, అధికారుల నిర్లక్ష్యమే ఈ సమస్యకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడం, ఇందుకు మంత్రి నిర్లక్ష్యం తోడు కావడం వల్లే సమస్య వచ్చిందనే విమర్శలున్నాయి. తప్పులు జరుగుతున్నప్పుడే ఎందుకు గుర్తించలేదని, ఎందుకు సరిదిద్దలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పొంగులేటి గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించిన దాఖలాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పెద్దదై, ఎంతో మంది బాధితులు అయితే తప్ప ఆయన మేల్కోలేదనే విమర్శలున్నాయి. వారి నిర్లక్ష్యానికి, వ్యక్తిగత ఆశలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.