హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): వరంగల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా, కాకతీయ విశ్వవిద్యాలయం(వరంగల్), అనంత లా కాలేజీ(కూకట్పల్లి)లో న్యాయశాస్త్ర ప్రవేశాలు ఆపినట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ హైకోర్టుకు నివేదించారు. మిగిలిన కాలేజీల్లో 5 నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రారంభమైందని తెలిపారు.
యూజీసీ నిబంధనలు ఉల్లంఘించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది భాసర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. లా కాలేజీలు, నల్సార్ విశ్వవిద్యాలయం బకాయిలున్నాయని రవిచందర్ చెప్పడంపై చీఫ్ జస్టిస్, నల్సార్ వర్సిటీకి చాన్స్‌లర్‌గా ఉన్న కారణంగా వ్యాజ్యాన్ని విచారించేందుకు నిరాకరించారు. జస్టిస్ సుజయ్‌పాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని చీఫ్ జస్టిస్ ప్రకటించారు.