బాన్సువాడ, అక్టోబర్ 18: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని కమ్మ సంఘానికి చెందిన 70 కుటుంబాలు, 50 నాయీబ్రాహ్మణ కుటుంబాలు స్పీకర్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ మేరకు బాన్సువాడలో స్పీకర్‌ను కలిసి తీర్మాన కాపీని అందజేశాయి.
నిర్మల్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సొంత గ్రామమైన ఎల్లపెల్లిలో బుధవారం ఆ గ్రామస్తులంతా కారు గుర్తుకే ఓటు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్లపెల్లి నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్దలు చేసిన ఈ తీర్మాన్ని సమావేశానికి హాజరైన గ్రామస్థులంతా చప్పట్లతో ఆమోదించారు. రాబోయే ఎన్నికల్లో తమ గ్రామంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తామంటూ తెలిపారు.
మందమర్రి రూరల్, అక్టోబర్ 18: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఆదిల్పేట్లో ఎంపీపీ గుర్రం మంగాశ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం మందమర్రి మండల స్థాయి గౌడ కుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, విప్ బాల్క సుమన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతకుముందు విప్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. జడ్పీటీసీ వేల్పుల రవి, కో-ఆప్షన్ మెంబర్ నసీరొద్దీన్, గౌడ సంఘం నాయకులు పోషగౌడ్, సుధాకర్‌గౌడ్, శంకర్‌గౌడ్, లింగాగౌడ్, తిరుపతిగౌడ్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.