హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని, ఉప ఎన్నికల్లో ఆయనను కచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అన్ని విధాలుగా గౌరవించినా పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసినవారు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టేది లేదని, వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కనీసం గుర్తుచేసినవాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొన్నదని ఎద్దేవా చేశారు.
పార్టీ కార్యకర్తలే కొండంత అండ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలనా సమర్థత ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందని, మార్పు పేరుతో ప్రజలను ఏమారుస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో కలిసి బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత అండ అని పేరొన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడినా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని ఈ సందర్భంగా ఆయా మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు తెలిపారు.