మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 15 : సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతారం వద్ద నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ దంపతులు గిరిజనులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ దంపతులు ముందుగా ర్యాలీగా వెళ్తారని పోలీసులు చెప్పి శంకర్‌నాయక్ ర్యాలీని అడ్డుకున్నారు.
దీంతో శంకర్‌నాయక్ వర్గీయులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎమ్మెల్యే ర్యాలీ వెళ్లిన అనంతరం శంకర్‌నాయక్ ర్యాలీని పంపించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ విలేకరులతో మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ పాలనలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. మళ్లీ పోటీచేసి తనపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శంకర్‌నాయక్ సవాల్ విసిరారు.