Bank Robbery | వనపర్తి జిల్లా అమరచింతలోని యూనియన్ బ్యాంక్‌లో దొంగతనానికి ప్రయత్నించిన భార్యాభర్తలు, వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బ్యాంకులోని డిజిటల్ వీడియో రికార్డర్, హ్యుండాయ్ క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు. 2024 డిసెంబర్ 30న అమరచింత యూనియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది బ్యాంకు తెరిచినప్పుడు స్ట్రాంగ్ రూమ్ హ్యాండిల్ విరిగిపోవడం, బాత్ రూం పక్క కిటికీ అద్దాలు పగిలిపోవడం, సీసీటీవీ కెమెరాల డీవీఆర్ వైర్లు కత్తిరించి ఉన్నాయి. కిటికీల ఐరన్ గ్రిల్స్ ఊడిపోయాయి. దీంతో అప్రమత్తమైన మేనేజర్ స్ట్రాంగ్ రూమ్ తెరిచి చూడగా నగదు, బంగారం ఆభరణాలు, ఇతర డాక్యుమెంట్లు అలాగే ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో బ్యాంకులో చొరబడి దొంగతనం చేయాలని ప్రయత్నించారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాల్లో తమ ఫోటోలు నిక్షిప్తం కాకుండా డిజిటల్ వీడియో రికార్డర్ వైర్లు కత్తిరించి డీవీఆర్ ఎత్తుకెళ్లారు. దాని విలువ రూ.8,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
పసుల అంకిత అనే మహిళ బీటెక్ పూర్తి చేసింది. పెండ్లికి ముందు దక్షిణ మధ్య రైల్వేలో టికెట్ కౌంటర్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తానని సాయి నివాస్ అనే వ్యక్తి పసుల అంకిత వద్ద రూ.5 లక్షలు తీసుకున్నాడు కానీ, ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో మోసపోయానని భావించిన పసుల అంకిత తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతుకుతున్నది. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడింది. తన జల్సాలకు వేతనం సరిపోవడం లేదు కనుక తాను మోసపోయినట్లే ఇతరులను తానూ మోసగించింది. గద్వాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి (ఒక్కొక్కరి నుంచి రూ.6లక్షలు) రూ.18 లక్షలు తీసుకుని జల్సాగా గడిపింది. గోవా, బెంగళూర్‌ల్లో టూర్లు వేసింది. 2022లో రాచాల జగదీశ్వర్‌రెడ్డితో ఆమె పెండ్లి జరిగింది. తర్వాత తన భర్త కట్టిన ఇంటికి, పెండ్లికి అప్పు అయ్యింది. దీనికి తోడు గతంలో మోసపోయిన ముగ్గురు గద్వాల వాసులు ఆమెపై గద్వాల టౌన్, ఐయిజ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. తాను తప్పు చేశానని, వారికి ఎలాగైనా డబ్బు చెల్లించాలని ఆమె కోరడంతో భర్త అంగీకరించాడు. అంత డబ్బు ఎక్కడ దొరుకుతుందీ అని ఇద్దరు చర్చోపచర్చలు జరిపి బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేశారు.
ఇందుకోసం పసుల అంకిత, ఆమె భర్త రాచాల జగదీశ్వర్ రెడ్డితోపాటు రాచాల భాస్కర్ రెడ్డి, మంద నాగరాజు, గణేశ్ రంగంలోకి దిగారు. రాచాల భాస్కర్‌రెడ్డి, మంద నాగరాజు, గణేశ్‌లకు డబ్బాశ చూపారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పసుల అంకిత హ్యుండాయ్ క్రెటా కారులో గద్వాల, నారాయణపేట, మరికల్ ప్రాంతాల్లోని బ్యాంకులను పరిశీలించారు. అక్కడ బ్యాంకు దోపిడీ చేయడానికి వీలు కాదని తేలిపోవడంతో 2024 డిసెంబర్ 27వ తేదీ రాత్రి అమరచింత మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో దొంగతనం చేయాలని ప్రయత్నించారు. బ్యాంకు వెనుక కిటికి గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాక్ స్ట్రాంగ్ రూమ్ తలుపును తమతో తెచ్చుకున్న గడ్డపార, మంకీ స్పానర్, ఐరన్ పైప్‌తో పగలగొట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తమ ప్రయత్నం విఫలం కావడంతో సీసీటీవీ కెమెరాల ద్వారా దొరికిపోతామని భావించి సీసీటీవీ కెమెరాలకు అనుసంధానించిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకెళ్లారు. కానీ, బ్యాంకులో బంగారం, నగదు, డాక్యుమెంట్లు, ఇతర వస్తువులు అలాగే ఉన్నాయి.
నేరస్తులను పట్టుకోవడానికి వనపర్తి ఐపీఎస్ అధికారి రావుల గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆత్మకూర్ సీఐ శివకుమార్, అమరచింత ఎస్ఐ సురేష్, సీసీఎస్ విభాగం సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో తనిఖీ చేస్తున్నారు. ఈ నెల ఐదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అమరచింతలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. హ్యుండాయ్ క్రెటా కారులో వెళుతున్న ఐదుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారని వనపర్తి ఎస్పీ తెలిపారు.