ఖమ్మం: ఖమ్మం జిల్లాలో (Khammam) డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బదావత్ లింగానాయక్.. మండల కేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్లో రూ.50 వేలు ముద్రా లోన్ తీసుకున్నారు. ఆ మొత్తానికి కొన్ని నెలలుగా వాయిదాలు చెల్లించడం లేదు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.
వాటికీ స్పందన లేకపోవడంతో సోమవారం ఆయన ఇంటికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ స్రవంతి, సిబ్బంది అప్పు చెల్లించాలని కోరారు. లింగానాయక్ స్పందించకపోవడంతో ఇంట్లో ఉన్న రెండు గొర్రెలను జప్తు చేసి జీపులో బ్యాంకుకు తీసుకెళ్లారు. దీంతో బ్యాంకుకు వచ్చిన లింగానాయక్ రూ.10 వేలు చెల్లించి, మిగతా నగదు వాయిదాల్లో చెల్లిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ ఆయన గొర్రెలను ఆటోలో తండాకు పంపించారు.