ఖైరతాబాద్, జనవరి 22 : బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ నెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్(యూఎఫ్బీయూ) కన్వీనర్ కే ఆంజనేయులు ప్రసాద్ తెలిపారు. ఏఐబీఈఏ, ఏఐబీవోసీ, ఎన్సీబీఈ, ఏఐబీవోఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్బీఈఎఫ్, ఐఎన్బీవోసీ, ఎన్వోబీడబ్ల్యూ, ఎన్వోబీవో సంఘాలు సంయుక్తంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడరు.
బ్యాంకింగ్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని, గతంలో కుదిరిన ఒప్పందాలను సైతం తుంగలో తొక్కుతున్నదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 2015లో పదో ద్వైపాక్షిక ఒప్పందం, ఏడో జాయింట్ నోట్ ప్రకారం రెండు, నాలుగో శనివారాలను సెలవులుగా ప్రకటించగా..మిగతా రెండు శనివారాలను సైతం సెలవులుగా ప్రకటించే అంశాన్ని తగిన సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకాలేదని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు.
2022-23లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సోమవారం నుంచి శనివారం వరకు రోజువారీ పని గంటలను మరో 40 నిమిషాలు పెంచి, మిగిలిన అన్ని శనివారాల్లో సెలవులు ప్రకటించేందుకు అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించి రెండేండ్లు అయినప్పటికీ ఇంకా పెండింగ్లోనే ఉందని వారు విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నీరసిస్తూ ఈ నెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు, అయినా ప్రభుత్వం దిగిరాకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమని వారు హెచ్చరించారు.