హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : యాదవ, కురుమల జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్సీ, నామినేట్ పదవుల్లో కాంగ్రెస్ మోసం చేసిందని, ఇదేనా రాహుల్‌గాంధీ పాటించే సామాజిక న్యాయం? అని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం, యాదవ హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పదవులతోపాటు పార్టీ పదవుల్లోనూ యాదవ, కురుమలకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని, రాహుల్‌గాంధీ ప్రవచించే సామాజిక న్యాయం డొల్ల అని నిరూపితమైందని విమర్శించారు. ఇకనైనా అత్యధిక జనాభా కలిగిన యాదవులు, మున్నూరుకాపులతోపాటు ఎంబీసీలకు వెంటనే మంత్రి పదవులు ఇవ్వాలని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ, 27న ఇందిరాపార్ దగ్గర యాదవ-కురుమల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగిరాకపోతే స్థానికసంస్థల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గొల్ల, కురుమలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 22 లక్షల మంది యాదవులు, ఆరు లక్షల మంది కురుమలు ఉన్నారని, అయినప్పటికీ మంత్రి పదవికానీ, ప్రభుత్వ సలహాదారు పదవి కానీ దక్కలేదని చెప్పారు. గొల్ల కురుమలకు ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు, ఐదు కమిషన్ సభ్యుల పదవులు, పార్టీలో వరింగ్ ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్స్, 8 జనరల్ సెక్రటరీలు, 5 డీసీసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంత్రివర్గంలోనూ, పార్టీ పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ గొల్ల, కురుమలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమారను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కుల సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ప్రజాభవన్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు.
రవీంద్రభారతి, జూన్ 12: జనాభా ప్రతిపాదికన బంజారాలకు మంత్రి పదవి కేటాయించాలని బంజారా గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో బంజారా గిరిజన జేఏసీ నాయకులు డాక్టర్ వెంకటేశ్ చౌహన్, డాక్టర్ రాజేశ్‌నాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బంజారాలకు మంత్రి పదవి ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వంలో లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తామని చెప్పారు. భారత రాజ్యాంగం బంజారా గిరిజనులకు కల్పించిన హక్కుల సాధన కోసం బంజారాల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. బంజారా గిరిజన సంఘాలతో కలిసి పార్టీలకతీతంగా ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు మూడావత్ కార్తీక్నాయక్, శ్రీమాన్నాయక్, ధరావత్ వినోద్‌నాయక్, ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐతరాజు అభయ్, డీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.