బంజారాహిల్స్, నవంబర్ 21: బంజారా రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎస్టీ సెల్ నేత ఆర్ విష్ణు నాయక్ హెచ్చరించారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే బంజారా రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు కచ్చితంగా బుద్ధి చెబుతామని తెలిపారు. లగచర్ల గ్రామంలో బంజారాలకు సంఘీభావం తెలిపేందుకు గురువారం హైదరాబాద్ నుంచి ఆలిండియా బంజారా సేవా సంఘం నాయకులు తరలివెళ్లారు. పరిగి సమీపంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండ్రోజుల నుంచి లగచర్ల వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని విష్ణునాయక్ పోలీసులను ప్రశ్నించారు. తమ జాతికి అన్యాయం జరుగుతుంటే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. అంతకుముందు విష్ణునాయక్, ప్రకాశ్ నాయక్, శ్రీనునాయక్, రాజు నాయక్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు.