హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. ఇందుకు రాష్ట్రం లో పలు ఎంఎన్‌సీలు పెట్టుబడులు పెట్టడమే నిదర్శనమని వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు.
బండి వ్యాఖ్యలు మతిలేని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. సైబర్ నేరాలను అదుపు చేయడంలో, నేరాల నమోదు, నేరస్థులను పట్టుకోవడం, డబ్బును రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని గుర్తుచేశారు. సైబర్ నేరాల బాధితులకు న్యాయం చేయడంలో తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ పోలీస్ ఇటీవల యూపీ మొఘల్ సరాయిలోని సైబర్ నేరస్తుల నుంచి రూ.9 కోట్లు రికవరీ కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
మానవ అక్రమ రవాణా విషయంలోనూ తెలంగాణ పోలీస్‌శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. వెట్టిచాకిరీ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. శాంతియుత తెలంగాణను కల్లోల రాష్ట్రంగా మార్చడానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.