హైదరాబాద్: రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు. పాతబస్తి లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారన్నారు. అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీచేయాలని, డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు.
కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని తెలిపారు. తాను హిందువుల తరపున పక్కా మాట్లాడుతానని, అయితే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.