Bandi Sanjay | వేములవాడ, జూన్ 11: సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని ఎట్టకేలకు అంగీకరించారు. ఒకవేళ బీజేపీ తరఫున ఎవరైనా గెలిచినా వారు బీఆర్ఎస్లోకే పోతారని
నిర్వేదం చెందారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీజేపీ సీనియర్ కార్యకర్తల సమ్మేళనంలో బండి సంజయ్ తన మనసులో మాటను బయటపెట్టారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఇతర సీనియర్ నేతల ముందే ఆయన తన పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని వాపోవటం గమనార్హం. బండి మాటలతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా తత్తరపాటుకు గురయ్యాయి. ఎంత నిజాలైతే మాత్రం ఇంత బాహాటంగా చెప్తే ఎలా అంటూ నేతలు మాట్లాడుకోవటం కనిపించింది.