హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు. పోక్సో కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో జరిగిన విచారణలో పప్పు నాగేశ్వర్రావు బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు.
తన కుమారుడు నిందితునిగా ఉన్న కేసులో అధికార పలుకుబడితో వ్యవస్థలను ఏమార్చేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవిలో ఉంటూ బండి సంజయ్ కేసును పకదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్లో జరిగిన ఏక్తాయాత్ర వేదికగా బండి బహిరంగంగా బెదిరింపు ధోరణితో హెచ్చరించారని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి వ్యక్తులు పదవిలో ఉండటం వల్ల బాధితురాలికి న్యాయం జరిగే అవకాశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని, బాధితురాలికి న్యాయం అందేలా చూడాలని పప్పు నాగేశ్వర్రావు తన లేఖలో అభ్యర్థించారు.