హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మూసీ పేరుతో భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తున్నదని విమర్శించారు. రూ.లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఏటీఎంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నదని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైందన్నారు. డబ్బుల్లేక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మరో రూ.1.5 లక్షల కోట్లు అప్పు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప ఏ మార్పు లేదని చెప్పారు. అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుందన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. నాబార్డ్ సంస్థ ఇచ్చిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే’ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని, ఇది జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయని తెలిపారు. జాతీయ సగటు 52 శాతం కుటుంబాలు మాత్రమేనన్నారు.
వాస్తవానికి మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం, ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో మళ్లీ అప్పులు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం మోయడాన్ని, పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వెళ్లడించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన ఈనెల 25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరరు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.