హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ఉప్పు-నిప్పులా ఉంటున్న బీజేపీ-కాంగ్రెస్ నేతలు.. తెలంగాణలో మాత్రం పాలు-పంచదారలా కలిసిపోతున్నారు. కాంగ్రెస్-బీజేపీ నేతల పొత్తు.. పొద్దు తిరుగుడు పువ్వులా ఎటుపడితే అటు తిరుగుతున్నది. సమయం, సందర్భం దొరికితే చాలు.. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ప్రేమను గుమ్మరించుకుంటున్నారు. తాజాగా ఆలిండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్ ముగింపులో కేంద్ర సహాయ మంత్రి బండిసంజయ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల పరిచయ కార్యక్రమం చర్చనీయాశంగా మారింది. ఒకే వేదికపై పాల్గొన్న ఇద్దరు నేతలు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ‘కేంద్ర సహాయ మంత్రి, మిత్రులు.. మా పెద్దన్న బండి సంజయ్‌గారు’ అని మంత్రి పొంగులేటి సంబోధించగా.. ‘తెలంగాణ రాష్ట్ర డైనమిక్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి’ అంటూ బండి సంజయ్ కొనియాడారు. వీరు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ దోస్తానా గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘కేంద్రంలో పొట్టుపొట్టున తిట్టుకునే నేతలు.. రాష్ట్రంలో ప్రేమానురాగాలు పంచుకుంటున్నారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.