హైదరాబాద్ : హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టక ముందే బండి సంజయ్ ( Bandi Sanjay ) ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ( Dismissed) చేయాలని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ( Padma Devender Reddy ) డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పొక్సో కేసులో నిందితుడిగా ఉన్నందున మంత్రి వర్గం నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి హోమ్ మంత్రిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.
సామాన్య మహిళ ఆర్తనాదాలను మోదీ,రేవంత్ వినాలని కోరారు. డీలిమిటేషన్ తో కూడిన మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో పార్లమెంటులో ప్రధాని మోదీ , ప్రతిపక్షాలు అన్యాయం చేశాయని మండిపడ్డారు. మహిళల కోసం ఎంతో చేస్తున్నామని సానుభూతి ప్రదర్శిస్తున్న ప్రధాని మాటలకే పరిమితమని ఆరోపించారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న స్పందించరని బండి సంజయ్ కొడుకు పై పోక్సో కేసు విషయంలో రుజువైందిని వెల్లడించారు.
మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడింది తన కేబినెట్ సహాయ మంత్రి కొడుకని తెలిసినా మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. పదమూడు గంటల పాటు మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయంపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్ స్టేషన్లో ఎదురు చూసిందంటే రాష్టంలో పోలీసులు సామాన్యుల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శిస్తున్నారో , పాలక పక్షాలకు కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులు కలిసి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయడం 2 కోట్ల మంది తెలంగాణ మహిళలను అవమానపరచడమేనని ఆరోపించారు. ప్రియాంక గాంధి మహిళనే కదా . సాటి మహిళ పై అత్యాచారం జరిగితే స్పందించారా అంటూ నిలదీశారు. బండి కొడుకును రక్షించాలని, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.