అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తుండు
గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది బీజేపీనే
నావికుడు లేని నావలా కాంగ్రెస్ పరిస్థితి
మీడియాతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, మార్చి 2: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాజ్యాంగం తెలియదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆరోపణలు మాని అవగాహన పెంచుకోవాలని హితవుపలికారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో జడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు. గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే బీజేపీ అని, కాంగ్రెస్‌ను మించి కేంద్రంలోని బీజేపీ సర్కారు గవర్నర్లను ఇష్టారీతిన వాడుకొంటున్నదని ధ్వజమెత్తారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాల్లో గవర్నర్లతో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రోరోగ్ కాకుండా అసెంబ్లీ ఎన్నిసార్లయినా సమావేశాలు నిర్వహించుకోవచ్చనే విషయం తెలుసుకోవాలని బండికి సూచించారు. గత సమావేశాల్లో భాగంగానే ఈ నెల 7 నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎంతో రాజకీయ చతురత కలిగిన వారని, రెండుసార్లు వ్యూహాత్మకంగా అడుగులు వేసి రాష్ట్రంలో టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి అధికారం సాధిస్తారని, ఆయన్ను ఢీకొట్టే నాయకుడే లేడని స్పష్టంచేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ్దం జరుగుతుంటే అక్కడ ఉన్న భారతీయలను అప్రమత్తం చేయడంలో, దేశానికి తీసుకురావడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలువాలనే కాంక్ష, ఉక్రెయిన్‌లో ఉన్న మనవారిని తీసుకురావడంలో ఎందుకు లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నావికుడు లేని నావలా మారిందని, ఎప్పుడు ఎక్కడ సముద్రంలో మునిగి పోతుందో చెప్పలేమని ఎద్దేవాచేశారు. 2023లో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ వేటికవే ప్రకటించుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రమంతా పోటీ చేయడానికి బీజేపీకీ అభ్యర్థులు లేరని, కాంగ్రెస్‌కు రోజూ తన్నుకోవటమే సరిపోతుందని చురకలంటించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త లేరని, మరోసారి ఆయన వ్యూహంతో రాష్ట్రంలో అధికారాన్ని పొందుతారని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు.