కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 23 : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై రాజకీయ విమర్శలు చేయనని కేంద్ర మంత్రి బండి సంజయ్అన్నారు. అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకొని పోతానని స్పష్టంచేశారు. స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్‌రావుతో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం అడుగుతామని, అవసరమైతే కొట్లాడి సాధించుకుందామని తెలిపారు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి కరీంనగర్ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా అందరం కలిసి పని చేద్దామని సూచించారు. వరంగల్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని, ఇందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ అభివృద్ధికి అనేక నిధులు తెచ్చి ఎన్నో పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. తాము చేపట్టిన అనేక అభివృద్ధి పనుల పూర్తికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బండి సంజయ్‌ని కోరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర నిధులతోపాటు కేంద్ర నిధులు రావడంతో అభివృద్ధి సాధించినట్టు తెలిపారు.