హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డిలో నోటికొచ్చినట్టు మాట్లాతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నోరు జాగ్రత్త బండి సంజయ్’ అని హెచ్చరించారు. రైతుల కోసం ఏమిచేయాలో బండితో చెప్పించుకోవాల్సిన గత్యంతరం తమకు లేదని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద అత్యంత గొప్పగా గౌరవం పొందుతున్న రైతు తెలంగాణ రైతేనని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి నడ్డి విరుస్తున్నదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొకించి చంపిన నీచమైన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులను నిండా ముంచుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కామారెడ్డిలో బండి సంజయ్ కొత్త డ్రామాకు తెరలేపారని నిప్పులు చెరిగారు. బండి సంజయ్‌కి చేతనైతే కేంద్రంతో మాట్లాడి సిలిండర్ ధర తగ్గించాలని, వ్యవసాయ రంగం మీద వేసే పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుల రక్తాన్ని పీల్చుకు తింటున్న రాకాసి బీజేపీ మాయమాటలు రైతులు ఎవ్వరూ నమ్మొద్దని వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ ఆర్వోబీపై అసత్యాలు
అబద్ధాలు చెప్పడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పీహెచ్డీ చేశారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కరీంనగర్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్వోబీని మంజూరు చేయాలని 2021 మే 29న రోడ్లు భవనాలశాఖ మంత్రిగా తాను రైల్వేబోర్డుకు విన్నవించగా, సెప్టెంబర్ 15న రూ.100 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో రాష్ట్రం వాటా రూ.79. 84 కోట్లు కాగా, రైల్వే వాటా రూ.20.16 కోట్లు మాత్రమేనని వివరించారు. సైట్ప్లాన్ను 2022 జనవరి 31న తమ శాఖ ద్వారా రైల్వేకు అందజేశామని తెలిపారు. ఆరు నెలల తరువాత రైల్వేశాఖ కౌంటర్ సిగ్నేచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని వివరించారు. అయితే, పరిపాలనాపరమైన అనుమతికి పరిశీలిస్తున్న క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ ఈ పనిని సేతుబంధన్ పథకం కింద చేపట్టేందుకు 2022 జనవరి 23న ఆమోదం తెలిపిందని చెప్పారు. సేతుబంధన్లో సీఆర్ఐఎఫ్ సెస్ కింద అదనపు నిధులను అందించడం ద్వారా రాష్ట్ర రహదారులపై ఇప్పటికే ఉన్న లెవల్‌క్రాసింగ్‌లు ఆర్వోబీ, ఆర్యూబీల కోసం రాష్ర్టాలకు సహాయం అందించాలని కేంద్ర రహదారులు, జాతీయరహదారులశాఖ 2021జూన్ 30న ప్రతిపాదించిందని తెలిపారు. గత జూన్ 28న సేతుబంధన్ కింద ప్రతిపాదించిన 57 పనుల జాబితాను అందజేశామని, ఇందులో 25 ప్రాధాన్యతా పనుల అంచనా వ్యయాలతో సేతుబంధన్ మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించినట్టు పేర్కొన్నారు.
కేంద్రానికి లేఖలెన్ని రాసినా..
రాష్ట్రంలో అధిక ప్రాధాన్యం ఉన్న కనీసం 10 పనులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23) రూ.1,065 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్గడరీకి 2022 సెప్టెంబర్ 26న లేఖ రాశానని వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం కేవలం 5 పనులనే మంజూరు చేసిందని చెప్పారు. కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాసినా ఆర్వోబీ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన 5 ఆర్వోబీల పైసలు కూడా కేంద్రానివి కాదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై చెల్లించే సెస్ ద్వారా వచ్చినవేనని చెప్పారు. సంవత్సరానికి రూ.5,000 కోట్ల సెస్ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నదని, ఇందులో సీఆర్ఐఎఫ్ కింద రాష్ట్రంలోని రోడ్లకు రూ.278 కోట్లు, ఆర్వోబీ/ఆర్యూబీ కోసం రూ.51 కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.