Bandi Sanjay | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడిచారని బండి సంజయ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. పదవి నుంచి దిగిపోయేదాకా తనను ప్రశాంతంగా ఉండనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కాస్తా బండి సంజయ్ వీడ్కోలు సభగా మారిపోయింది. సభ ఆద్యంతం బండి నామస్మరణతో నిండిపోయింది. దీంతో చిన్నబోవడం కిషన్‌రెడ్డి వంతయ్యింది. సొంత పార్టీ నేతలే తనకు పొగబెట్టారన్న విషయాన్ని బండి సంజయ్ చెప్పారు. ‘కనీసం కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనీయండి. ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం ఆపండి’ అని సూచించారు. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు, నేతల కోసం పనిచేయాలని కోరారు. సొంత ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఆరాటపడుతున్న నేతలకు పరోక్షంగా పంచ్‌లు వేశారు. పక్కాగా ఈ వ్యాఖ్యలు ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి చేసినవేనని బండి వర్గం నేతలు చెప్పుకొంటున్నారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసింది, బండి పదవి పోయేదాకా విశ్వ ప్రయత్నాలు చేసింది, పార్టీలోకి రాగానే పదవుల కోసం ఆరాటపడింది ఈటలనే అని గుర్తు చేస్తున్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగానే ఈటల రాజేందర్‌ను విమర్శించినట్టు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఈటల రాజేందర్ ముఖం చిన్నబోయిందని పేర్కొంటున్నారు.
కిషన్‌రెడ్డి సభలో బండి భజన
బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం బండి నామస్మరణ చేశారు. బండి సంజయ్ పాదయాత్రల వల్లే బీజేపీకి ఆదరణ పెరిగిందని, ప్రధాని మోదీ మూడుసార్లు బండిని పొగిడారని తెలిపారు. పదవి నుంచి తొలిగించిన తర్వాత తన దగ్గరికి వచ్చి గంటన్నర సేపు బాధపడ్డారని చెప్పారు. పార్టీలో మంచి పదవి వస్తుందంటూ ఊరడించే ప్రయత్నం చేశారు. ఇతర నేతలు కూడా బండి సంజయ్ గురించే ఎక్కువగా మాట్లాడటంతో కిషన్‌రెడ్డి ముఖం మాడిపోయింది. కిషన్ సన్మాన సభనో, బండి వీడ్కోలు సభనో అర్థం కావడం లేదంటూ కిషన్‌రెడ్డి అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ ద్వేషిని తెచ్చుకున్నారు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సీనియర్ నేత విజయశాంతి అర్ధంతరంగా వెళ్లిపోయారు. దీంతో ఆమె అలిగి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. తెలంగాణను ద్వేషించిన వ్యక్తిని చూడగానే తనకు అక్కడ ఉండబుద్ధి కాలేదని చెప్పారు. అందుకే వెనక్కి వచ్చేశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారన్నది సుస్పష్టం. తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచీ అవమానించింది, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిండు అసెంబ్లీలో విద్వేషం వెళ్లగక్కిన వ్యక్తి కిరణ్‌కుమార్‌రెడ్డి. అలాంటి వ్యక్తిని బీజేపీ చేర్చుకోవడమే కాకుండా, ఏకంగా తెలంగాణ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి తీసుకురావడంతో విజయశాంతి మనస్తాపం చెందారు. బీజేపీ నేతలు, కార్యకర్తల్లోని తెలంగాణవాదులు సైతం ఈ పరిణామాన్ని అసహ్యించుకుంటున్నారు. తెలంగాణ ద్వేషిని ఎలా పిలుస్తారని, వేదిక మీదికి ఎలా రానిస్తారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే పార్టీ కనుమరుగయ్యే దశలో ఉన్నదని, ఇలాంటి చర్యలతో పూర్తిగా నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.